“నాకు ఉన్న కల ఒకటే. మా పిల్లలు, ఆరెంకెల జీతం సంపాదిస్తూ, అన్ని సదుపాయాలూ ఉన్న ప్రాంతంలో స్థిరపడాలి. నాకు ఇంకొక కల కూడా ఉంది. రిటైర్ అయ్యి, మా సొంత ఊరు విజయనగరం వెళ్ళి, ఒక ఇల్లు కట్టుకుని శేష జీవితం అక్కడే గడపాలి.
బ్రతుకుదెరువు కోసం, దాదాపు 14 సంవత్సరాల క్రితం, మా ఊరు నుంచి విజయవాడ వలస వచ్చాను. అప్పులు తీర్చుకుని, ఇక్కడికి రావడానికి, మా ఊర్లో పొలం అమ్మాల్సి వచ్చింది. నేను పగటి పూట దుప్పట్లు అమ్ముతాను, రాత్రి పూట వాచ్ మాన్ ఉద్యోగం చేస్తాను.
రోజూ, మా ఆవిడా బట్టలు ఇస్త్రీ చేస్తుంది. నా సంపాదన రోజుకి 200 నుంచి 300 రూపాయల వరకూ ఉంటుంది. మాకు వచ్చే సంపాదన తక్కువే అయినా, పిల్లలని మంచిగా పెంచగలిగినందుకు గర్వంగా ఉంది. మా అబ్బాయి ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. అబ్బాయి ఎప్పుడు చదువు పూర్తి చేసి, ఎప్పుడు మంచి ఉద్యోగం సంపాదిస్తాడా అని ఎదురుచూస్తున్నాను. వాడి కాళ్ళ మీద వాడు నిలబడితే, మాకు ఉన్న బాధ్యత తీరిపోతుంది. మాకు కొంత విశ్రాంతి దొరుకుతుంది. నాకున్న రెండు కలలు త్వరలోనే నెరవేరుతాయని ఆశిస్తున్నాను.”