“నేను ఆరోగ్యవంతుడ్ని, యువకుడ్ని కాబట్టి, నాకు కరోనా సోకదని అనుకున్నాను. కానీ, నా ఆలోచన తప్పయింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన కొత్తల్లో, కరోనా వ్యాపాటి గురించిన వార్తలు విజయవాడ లో కూడా ప్రారంభమయ్యాయి. కోవిడ్ కేసులు దేశంలో స్థిరంగా పెరుగుతున్నాయని నాకు తెలుసు. కానీ. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ గురించి అందరికీ అంతగా తెలియదు.
నేను తరచుగా చేతులు శుభ్రం చేసుకుంటాను. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకుంటాను అనుకున్నాను. ఇప్పడు ఆలోచిస్తే అనిపిస్తుంది. నాకు కరోనా రావడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు అని. మా నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్ లో పని చేస్తారు. లాక్డౌన్ సమయంలో, రవాణా సదుపాయం లేదుకాబట్టి, మా నాన్న ని ఆఫీస్ దగ్గర దింపడం, తిరిగి ఇంటికి తీసుకురావడం చేసేవాడ్ని. నాన్నని ఆఫీస్ దగ్గర దించి వచ్చేటప్పుడు, ఒక్కడ్నే వస్తాను కాబట్టి దోవలో నడుచుకుంటూ వచ్చే వాళ్ళు లిఫ్ట్ ఇమ్మని అడిగేవాళ్ళు. మే చివరి వరకూ అలాగే జరిగేది. జూన్ 1వ తారీఖున ఇంటికి వచ్చాక, కొద్దిపాటి జ్వరం, వొళ్ళు నొప్పులుగా అనిపించింది. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి, టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి, కోవిద్ పరీక్ష చేయమని అడిగాను. కిద్దిపాటి జ్వరంతో పాటు, తలనొప్పి, వొళ్ళు నొప్పులు కూడా కలిగింది. దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జూన్ 2వ తారీఖున నా స్వాబ్ టెస్టింగ్ కి ఇచ్చాను. తరువాత, నాకు కోవిడ్-19 పాజిటివ్ అని తెలిసింది. దాని వల్ల, నేను ఎన్నో సమస్యలను ఎదురుకున్నాను. ఆ సమస్యలను ఈరోజుకి కూడా ఎదురుకుంటున్నాను. కోవిడ్-19 నిర్ధారణ అయిన తరువాత, నేను గుడవెల్లి లోని ఐసోలేషన్ సెంటర్ లో చేరాను.
ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అంబులెన్స్ డ్రైవర్ గురించి. నేను మానసికంగా కుంగిపోకుండా ఉండేలా, ఆయన తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన నన్ను పిలిచి, అంబులెన్స్ ఎక్కమన్నారు. అదృష్టం ఏంటంటే, మా కుటుంబ సభ్యులు ఎవరూ కరోనా బారిన పడలేదు. నేను గుడవెల్లి ఆసుపత్రిలో ఎనిమిది రోజులు గడిపాను. తరువాత, నేను డిశ్చార్జ్ అయ్యాను.
ఆ సమయంలో, నేను బయట ప్రపంచంతో సంబంధాన్ని కోల్పోయాను. ఇంట్లో వాళ్ళతో కలిసి భోజనం చేయడం, సాయంత్రాల్లో స్నేహితులతో కలిసి బయటకి వెళ్ళడాన్ని మిస్ అయ్యాను. .
నాకు ప్రమాదకరమైన లక్షణాలు ఏమీ లేవు. వైద్యులకు, సహాయకులకు నేను రుణపడి ఉన్నాను. అదృష్టవశాత్తూ నేను ఇంటికి తిరిగొచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ఉండగలుగుతున్నాను. నా మీద నేను దృష్టి పెట్టుకోవడానికి ఈ సమయం దొరికింది. నాకు ఎంతో ప్రేమ, మద్దతు లభించింది. ప్రతీ సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోకూడదు.”