“మా పిల్లలు కూడా సంపాదిస్తున్నారు. కానీ, ఆ సంపాదన మా ఖర్చులకి సరిపోయేది కాదు. దీంతో ఎక్కువ సంపాదన వస్తుందని, అందరం వేరువేరు వృత్తులను ఎంచుకున్నాం.
మాది గుంటూరు జిల్లాలో, బాపట్ల అనే ఒక పట్టణం.
నేను ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టి 15 సంవత్సరాల పైనే అయ్యింది. ఇంతకు ముందు, నేను రిక్షా లాగేవాడ్ని అక్కడ అంతగా పని లేకపోవడంతో, కల్లు ఉప్పు అమ్మడం మొదలుపెట్టాను.
ఉదయం 6 గంటలకి ఇంట్లో నుంచి బయలుదేరతాను. గోడౌన్ లో నుంచి, 30-40 కిలోల కల్లు ఉప్పు సైకిల్ వెనక కట్టుకుంటాను. అలా అమ్మిన ఉప్పుతో రోజుకి 250-300 రూపాయల వరకూ సంపాదిస్తాను.
సాయింత్రాలు, ఇంట్లోనే ఉంటూ, నా మనవరాళ్లతో ఆడుకుంటాను. అప్పుడప్పుడూ వాళ్ళని బీచ్ కి తీసుకువెళుతుంటాను. వాళ్ళకి, అక్కడ బెలూన్ లతో ఆడుకోవడం, ఐస్ క్రీమ్ తినడమంటే ఇష్టం.
నా మనవరాళ్ళు భవిష్యత్తులో మంచిగా చదువుకోవాలి. అందుకనే, 67 సంవత్సరాలు వచ్చినా కూడా నేనింకా కష్టపడుతున్నాను. ఏదో ఒకరోజు వాళ్ళు ఎలాంటి కష్టాలు పడకుండా స్వేచ్చగా విహరించాలని కోరుకుంటున్నాను.”