“హలో అండి. నేను మీకు బత్తాయి జ్యూస్ ఇచ్చేవాడ్ని. కానీ, దురదృష్టవశాత్తూ జ్యూస్ తీయడానికి పండ్లు ఏమీ మిగలలేదు. సాధారణంగా, నేను సాయంత్రం 6: 30 గంటల వరకూ ఉంటాను. కాకపోతే, ఈ రోజు షాప్ త్వరగా మూసేస్తున్నాను. రాత్రికి నాకు ట్రైన్ ఉంది. దాదాపు 10 నెలల తరువాత మా ఊరికి వెళ్తున్నాను.
నేను గత తొమ్మిది సంవత్సరాలుగా విజయవాడలో బత్తాయి జ్యూస్ అమ్ముతున్నాను. కొన్ని నెలల క్రితం, నా స్టాల్ ని నున్నా బైపాస్ రోడ్డు కి మార్చాను.ఇప్పటి వరకూ అమ్మకాలు బాగానే ఉన్నాయి. తాజా బత్తాయి రసం తాగడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుంటున్నారు కాబట్టి వచ్చే సంవత్సరం వ్యాపారం పెరగొచ్చు.
అజిత్ సింగ్ నగర్ లో మాకు ఒక చిన్న గోడౌన్ ఉంది. మాకు కావాల్సిన పదార్థాలు అన్నీ అక్కడే నిల్వ ఉంచుతాం. ఒకసారి పని మొదలైతే, సాయంత్రం వరకూ బిజీ గానే ఉంటాను. నేను మధ్యలో విరామం కూడా తీసుకోను. నా దగ్గరికి వచ్చే కస్టమర్లు వేరుగా ఉంటారు.పండక్కి ఊరికి వచ్చినవాళ్ళు, పని ముఞ్చసి ఇంటికి తిరిగి వెళ్ళే వాళ్ళు, ఆసుపత్రిలో ఉన్నవాళ్ళని చూడటానికి వచ్చేవాళ్ళు వస్తారు.
పండగ సీజన్ కాబట్టి, నేను రెండు వారాలు స్టాల్ మూసేస్తాను. ఈ దీపావళికి, విరామం తీసుకుని, కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నాను. మా తమ్ముడు ఇంకా చదువుకుంటున్నాడు. కాబట్టి, వాడికి కూడా నా వంతు సహాయం చేయాలి. దీపావళి అయిపోగానే మల్లి నా పని మొదలుపెడతాను. నాకు ఇక్కడే ఒక పెద్ద రెస్టారెంట్ ప్రారంభించాలని ఉంది. కానీ, దానికి సరిపడా డబ్బులు నా దగ్గర లేవు. నన్ను నేను ఊహించుకున్న స్థాయి మాత్రం ఇది కాదు. త్వరలోనే, నేను కోరుకున్న స్థాయికి చేరుకుంటానని నా నమ్మకం!”