“దాదాపు ఎనిమిది నెలల నుంచి, విజయవాడలోని ఆంధ్ర ప్రభ కాలనీ లో పేపర్లు వేస్తున్నాను. నేను 40 ఇళ్లల్లో పేపర్లు వేస్తాను. అందులో ఎక్కువ శాతం అపార్ట్మెంట్ లే ఉంటాయి. కొన్ని అపార్ట్మెంట్ లలో ఉదయం 6:30 వరకూ లిఫ్ట్ ఆపేస్తారు. అందుకని, పేపర్లు బాల్కనీలోకి వేసినా కస్టమర్లు ఏమీ అనరు. ఇప్పటి వరకూ నా గురి తప్పలేదు. మా కుటుంబానికి తోడ్పాటు అందించడానికి నేను ఈ ఉద్యోగం ఎంచుకున్నా. మా కాలనీలో నా స్నేహితుడు ఒకడు న్యూస్ పేపర్ వేస్తాడు. దాంతో ఈ ఉద్యోగం ఇప్పించమని వాడి దగ్గరికి వెళ్ళాను. అలా న్యూస్ పేపర్ డెలివరీ బాయ్ గా నా ప్రస్థానం మొదలయ్యింది. ఉద్యోగం పని వేళలు చాలా సౌకర్యంగా ఉన్నాయి. దీని వల్ల నా చదువుకి ఎటువంటి ఇబ్బంది కలగదు. ఉదయం 5:00 కి నా రోజు మొదలవుతుంది. నేను నా స్నేహితుడి దగ్గరికి వెళ్తాను. అక్కడికి నుంచి, ఇద్దరం కలిసి సైకిల్ మీద ఫుడ్ జంక్షన్ సర్కిల్ కి వెళ్ళి న్యూస్ పేపర్లు తీసుకుంటాము. ఉదయం 7 గంటల లోపు మాకు అప్పచెప్పిన ఇళ్లల్లో పేపర్లు వేసేస్తాము. నేను పనిలో చేరిన కొత్తలో, మా యజమాని ఒక పేపర్ మీద ఎవరి ఇంట్లో పేపర్లు వేయాలి, ఏ పేపర్ వేయాలి అని రాసి ఇచ్చేవారు. నెల రోజుల్లో నేను అన్నీ గుర్తుపెట్టుకోవడం మొదలుపెట్టా. పేపర్లు వేయడం అయిపోయాక, అందరం మళ్ళీ షాప్ బేస్మెంట్ దగ్గర కలుస్తాము. మా యజమానికి మేము వేసిన పేపర్ల లెక్క చెప్తాము. అది అయ్యాక, నేను ఇంటికి వెళ్ళి, తయారయ్యి కాలేజీకి వెళ్తాను. నేను పని చేయడం మా అమ్మకి అసలు ఇష్టం లేదు. ఇలా పనిచేస్తే, నా పైచదువులకి డబ్బులు పోగేయచ్చని నా ఆశ. నేనిప్పుడు 12వ తరగతి చదువుతున్నాను. భవిష్యత్తులో పెద్ద కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అవ్వాలని నా కల!”