“కోవిడ్-19 మహమ్మారి మనం ఎప్పుడూ ఊహించని విధంగా దేశాన్ని అతలాకుతకులం చేసింది. గతంలో హెల్త్ ఎమర్జెన్సీస్ ఉన్నా కానీ, ఈ విధంగా దేశ వ్యాప్తంగా ప్రభావం మాత్రం చూపలేదు.
మా స్వస్థలం విజయవాడ. మేము ఉండే ప్రదేశాన్ని అధికారులు రెడ్ జోన్ గా గుర్తించారు, ఆ ప్రాంతం కంటైన్మెంట్ కిందకి వస్తుంది. ఆ ప్రాంతంలో ప్రజలు బయటకి రావడానికి వీలు లేదు. నాకు మెడికల్ షాప్ ఉంది కాబట్టి, అధికారులు నాకు బయటికి రావడానికి వెసలుబాటు కల్పించారు. ఇంతకు ముందు నేను షాప్ ఉదయం 9 గంటలకి తెరిచేవాడ్ని, ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి ఉదయం 6: 30 కే తెరుస్తాను.ప్రజలకి మందులు అందుబాటులో ఉండాలని నేను రోజుకి 14 గంటలు కష్టపడుతున్నాను. అది మాత్రమే కాదు, బయటికి రాలేని వృద్దులకు ఇంటికే మందులు సరఫరా చేస్తాం. ఈ కష్టసమయంలో మన ప్రాణాలకి తెగించి సామర్థ్యాలని మించి కష్టపడాలి.మా వంతుగా దేశానికి సాయపడటానికి మేము సాయ శక్తులా కష్టపడుతున్నాం.
ప్రజలు కూడా ప్రభుత్వం జరీ చేసిన లాక్డౌన్ మార్గదర్శకాలను అర్థం చేసుకోవాలి.పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఎంత చెప్పినా కూడా ప్రజలు లాక్డౌన్ రూల్స్ ని అతిక్రమించి రోడ్ల మీదికి వస్తున్నారు. చిన్న పిల్లలు, ముసలి వాళ్ళకే కరోనా సోకుతుందని ఒక అపోహ జనాల్లో ఉంది. వైరస్ ఉందని తెలియని ఒక వ్యక్తి చాలు వైరస్ వ్యాప్తి చెందడానికి.
గత రెండు వారాల నుంచి పోలీసులు డ్రోన్ల ద్వారా కంటైన్మెంట్ ప్రాంతాలను పర్యవేక్షిస్తుండటం మంచి విషయం. ప్రజల కదలికలని నియంత్రించడానికి ఇదొక మంచి మార్గం.ఈ క్లిష్ట పరిస్థితిని మార్చడంలో ప్రభుత్వానిది, ప్రజలది సమిష్టి కృషి. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి మనందరం కలిసికట్టుగా ఒక సమాజంలా నడుచుకోవాల్సిన సమయం ఆసన్నం అయ్యింది.”