“కోవిడ్ తరువాత విద్యార్థులకి ఉద్యోగాలు దొరుకుతాయా?. లేదా విద్యార్థులు కొత్త నైపుణ్యాలను పెంచుకోవాల్సి వస్తుందా? ఒకవేళ ఉద్యోగం రాకపోతే భవిష్యత్తు ఏంటి?. చాలా కాలం నుంచి ఈ ప్రశ్నలే నన్ను వెంటాడుతున్నాయి. ప్రస్తుతం, నా భవిష్యత్తు నిశ్చయంగా లేదు.
నా కాలేజీ చివరి సంవత్సరం అయిపోయింది. గత వారమే ఫైనల్ ఎగ్జామ్స్ రాశాను. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కెరీర్ ఎంపిక గురించి చర్చిస్తున్నాను.
ఇంకా పై చదువులు చదవాలా, ఉద్యోగం చేయాలా, లేదా మా బంధువుల వ్యాపారంలో చేరాలా అర్థం కావట్లేదు.
మా నాన్న ఒక బిల్డర్. పై చదువులు చదివే బదులు, ఉద్యోగం చేసి మా కుటుంబాన్ని పోషించాలి అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వల్ల, ఉన్నత చదువు చదువుకోలేకపోయినందుకు, ఆయన ఇష్టం వైపు అడుగువేయలేకపోయినందుకు మా నాన్న ఇప్పటికీ బాధపడుతుంటారు.
నాకు, మా చెల్లికి అలా అవ్వకూడదు అని మా నాన్న ఆలోచన. ఉన్న అవకాశాలని వినియోగించుకోవడానికి మా నాన్న మాకు అవకాశం కల్పించారు. ఇప్పుడు నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను!”