“నాకు చదువంటే పెద్ద ఇష్టం ఉండేది కాదు. అందుకని, ఇంటర్మీడియేట్ తరువాత, చదువు ఆపేశాను. మా నాన్న దగ్గర నుంచి ఈ గారేజ్ నిర్వహించే బాధ్యతలు తీసుకున్నా. నా ఎస్. ఎస్. సి తరువాత, ఎంఫిల్డ్ వాళ్ళు కడపలో నిర్వహించిన సర్టిఫైడ్ వర్కుషాప్ లో పాల్గొన్నాను. ఆ వర్కుషొప్ లో సాంకేతికతలు, వివిధ రకాల బండ్ల గురించి తెలుసుకున్నాను.
రెండు సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకుని, గ్యారేజ్ బాధ్యతలు తీసుకునే ముందు మా నాన్న దగ్గర కుడా పని చేశాను.
మా గ్యారేజ్ ని ఉదయం 9 గంటలకి తెరుస్తాను. సాయంత్రం 7: 30 వరకూ గ్యారేజ్ తెరిచే ఉంటుంది. ఆదివారం మాత్రం గ్యారేజ్ సెలవు. నేను పాత బులెట్లతో పాటు, వివిధ రకాల బైక్లు రిపేర్ చేస్తాను.నేను 70/ 80 ల నాటి మరీ పాత బడిన బండ్లు రిపేర్ చేయను.అంత పాత బండ్ల స్పేర్ పార్టులు దొరకడం చాలా కష్టం. అందుకనే వాటిని రిపేర్ చేయడం మానేశాము.
నా దగ్గరికి వచ్చే కస్టమర్లు, పాత బండ్లే మంచివని భావిస్తుంటారు.కానీ, నాకు అలా అనిపించదు. పాత బండ్లకుండే ప్రత్యేకత ఏంటంటే, అవి చాలా దృఢంగా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే బండ్ల భాగాలన్నీ, దాదాపు ఫైబర్ లేదా ప్లాస్టిక్ తో చేసినవే. కొత్తబండ్లకి హార్స్ పవర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బండ్లు చాలా స్మూత్ గా నడుస్తాయి.
మార్కెట్ లో కొత్త బండ్లకి స్పేర్ పార్టులు చాలా సులభంగా దొరుకుతాయి. ఎక్కువగా ఉపయోగపడే టైర్లు, కేబుళ్ళు, ఆయిల్ మా దగ్గర స్టాక్ పెట్టుకుంటాం.
ఒక మెకానిక్ గా, కష్టపడి పనిచేస్తూ, బైకుల మీద నాలెడ్జ్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తాను.
నేను గత 11 సంవత్సరాలుగా ఈ గ్యారేజ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నేను ఇక్కడ పని చేయడం మొదలుపెట్టిన కొత్తల్లో, చాలా మంది కస్టమర్లు నేను చిన్నవాడ్ని అని నాకు బండ్లు ఇవ్వడానికే ఆలోచించేవారు. దీని కోసం ప్రతి రోజూ కష్టపడుతూ, నన్ను నేను నిరూపించుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నా కస్టమర్లు, నా దగ్గర తప్ప వేరే దగ్గర రిపేర్ చేయించడానికి ఇష్టపడరు. వాళ్ళ నమ్మకం సంపాదించడం నాకు గర్వంగా ఉంటుంది.”