“మా ఆయన ఎప్పుడూ అంటూ ఉండేవారు జీవితంలో మనకెప్పుడూ సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలని మనం ఎలా ఎదుర్కొంటాం అనేది ముఖ్యం అని. ఈ మధ్యనే నేను కోవిడ్-19 మహమ్మారి బారిన పడ్డాను. అదృష్టవశాత్తూ, 94 ఏళ్ళ వయసులో కూడా నేను కోలుకొని, మీ ముందు ఇలా ఆరోగ్యంగా కూర్చోగలుగుతున్నాను.
మా పెద్దబ్బాయి కుటుంబంతో సమయం గడపడానికి, ఈ మధ్యనే నేను, అనంతపూర్ లోని గార్లదిన్న నుంచి పుట్టపర్తి వచ్చాను. నా మనవడు రవి, అతని భార్యతో నాకు మంచి అనుబంధం ఉంది. ఖాళీ సమయాన్ని వాళ్ళు నాతోనే గడుపుతారు. నా మనవడి భార్య, పుట్టపర్తిలోని స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తుంది.
అంతా సవ్యంగా సాగుతుంది అనుకున్నప్పుడు రుచి, వాసన కోల్పోవడం వంటివి కరోనా లక్షణాలు అని తను చెప్పింది. దురదృష్టశాత్తూ ,ఆగష్టు 8వ తారీఖున తనకి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మా కుటుంబ సభ్యులందరమూ టెస్ట్ చేపించుకున్నాము. ఆగస్టు 10వ తారీఖున నాకు, మా మనవడికి కరోనా పాజిటివ్ వచ్చింది.
నా రిపోర్ట్ లో, జ్వరం మినహా ఎలాంటి లక్షణాలు లేవనీ, కోమోర్బిడిటీస్ లేకుండా కరోనా పాజిటివ్ వచ్చిందని ఉంది. మా మనవడిది కూడా అదే పరిస్థితి. అందుకని, హాస్పిటల్ ఐసోలేషన్ వార్డ్ లో కాకుండా, ఇంట్లోనే ఉన్నాము. అప్పుడు మేము ఒక నిర్ణయానికొచ్చాము. గాబరా పడకుండా, డాక్టర్లు ఇచ్చిన మార్గదర్శకాలు తూచా తప్పకుండా పాటించాలి అని. ఎందుకైనా మంచిదని, మా మనవడు నా కొడుకుని , కోడలిని , వాడి 4 ఏళ్ళ కూతురిని మొదటి అంతస్తుకి పంపించేశాడు. మా ఇల్లు రెండస్తులు కాబట్టి, మేము గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉన్నాము.
ఆ తరువాత, మేము ముగ్గురం సామాజిక దూరం పాటిస్తూ, ఐసీఎంఆర్ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాము. మందులు, మంచి ఆహారం తీసుకోవడంతో పాటు ఆయుర్వేద ఇంటి చిట్కాలను కూడా అనుసరించాం. శ్వాస తీసుకోవడంలో ఉండే ఇబ్బందులని అధిగమించడానికి, వేడి నీళ్ళతో ఆవిరి పీల్చాము.ఒకే చోట అలా ఉండటం అంత తేలిక కాదు. నేను మానసికంగా చాలా దృఢంగా ఉన్నాను. ఆ సమయంలో, మా కుటుంబ సభ్యులు నేను కృంగిపోకుండా చూసుకున్నారు. 14 రోజులు హోమ్-ఐసోలేషన్ తరువాత మళ్ళీ పరీక్ష చేయించుకున్నాం. ఆ దేవుడి దయ వల్ల అందరికీ నెగిటివ్ వచ్చింది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ ఒక విధమైన భయం కలుగుతుంది. కోవిడ్ అనేది జయించలేని రోగం కాదు.మనందరం కలిసికట్టుగా ఉంటూ, సానుకూల దృక్పథంతో ఉంటే ఈ మహమ్మారిని జయించొచ్చు!”