“మా స్వస్థలం సత్తెనపల్లి అయినా కూడా, గత 15 సంవత్సరాలుగా నేను గుంటూరులోనే నివసిస్తున్నాను. మొదట్లో నాకు రిక్షా ఉండేది కానీ, రిక్షాలు, సిటీ బస్సుల సంఖ్య పెరిగేసరికి నా ఆదాయం పడిపోయింది.అందుకని నా రిక్షాని రీడిజైన్ చేసి ట్రాలీ గా మార్చాను. దీంతో నేను లోకల్ సప్లయర్ లకి వస్తువులు సరఫరా చేయగలుగుతున్నాను. సాధారణంగా నాకు రోజుకి 300-350 ఆదాయం వస్తుంది. ఈ లాక్డౌన్ వల్ల గత కొన్ని వారాల నుంచి ఆ ఆదాయం లో సగం కూడా రావట్లేదు. మాలాంటి వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని అందరూ అంటున్నారు. కానీ కష్టపడకుండా ఆ సహాయం పొందడం నాకు ఇష్టం లేదు. కష్టపడకుండా ఏదీ పొందకూడదు అనేది నా స్వభావం. ప్రభుత్వం ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేలా మరిన్ని సదుపాయాలు కల్పిస్తుందని ఆశిస్తున్నాను!”