“రోజూ అలారం మోతకు ఉదయం 8 గంటలకి నిద్ర లేవడం, అరగంటలో గబగబా తయారవడం, తొందరగా టిఫిన్ తినేసి కాలేజీకి పరిగెత్తడం ఇదే నా డైలీ రొటీన్. అటెండెన్స్ తక్కువ ఉండేది కాబట్టి ఇలా చేయక తప్పేది కాదు.
నేను జలంధర్ లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ లో అగ్రికల్చర్ లో డిగ్రీ చదువుతున్నాను. మాకు మార్చి మొదటి వారంలో 15 రోజులు ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. అప్పటికింకా ఇండియాలో కరోనా అడుగుపెట్టలేదు. సెలవులకని నేను మా ఊరు కడపకి వచ్చాను. అంతలా ఇలా జరిగిపోయింది. కరోనా వల్ల మా పరీక్షలు వాయిదా వేశారు, కొన్ని రోజుల తరువాత దేశవ్యాప్తంగా లక్దౌన్ ప్రకటించారు. ఇది మనకి ఒక కష్టకాలం కానీ, క్వారెంటైన్ వల్ల కలిగే లాభాల గురించి కూడా ఆలోచించాలి.ఒక మాటలో చెప్పాలంటే దీని వల్ల నా డైలీ రొటీన్ పూర్తిగా మారిపోయింది.
మన ఉదయపు అలవాట్లు మిగతా రోజు మీద ప్రభావం చూపుతాయని చెపుతారు. ఈ అలవాట్లపు ప్రాముఖ్యత నేను ఆలస్యంగా తెలుసుకున్నా. ఈ మధ్య ఆత్మ విశ్వాసం తగ్గడం వల్ల, ఆందోళన సమస్యల వల్ల కష్టసమయం గడుపుతున్నాను. కాలేజీ మొదటి రోజుల్లో ఆందోళన మరింతగా ఉండేది.కడుపులో పేగులు లాగేస్తున్నట్టుగా కూడా అనిపించేది. తోటి విద్యార్థులతో కలవాలన్నా ఇబ్బందిగా ఉండేది. క్లాస్ ప్రెజంటేషన్ ఉందంటే గుండె దడ పుట్టేది. అన్నిటి గురించి ఆందోళన కలిగేది.దీని వల్ల మానసిక ఆరోగ్యం మీద ప్రభావం పడేది, నేను దాన్ని తట్టుకోలేకపోయేవాడ్ని.అన్ని నుంచి కొంత విరామం ఉంటే బాగుండు అనిపించేది. కాలేజీ, కాలేజీ లో ఉండే రూల్స్ వల్ల నాకు విరామం తీసుకునే అవకాశం లభించలేదు.
ఈ క్వారెంటైన్ పీరియడ్ వల్ల నాకంటూ సమయం వెచ్చించగలుగుతున్నా. డైలీ రొటీన్ నుంచి కొద్దిగా విరామం తీసుకుని నా తప్పుల మీద ఆత్మపరిశిలన చేసుకోగలుగుతున్నా. బాల్కనీ లో నుంచుని, ఆకాశం వంక చూస్తూ, చల్లటి గాలి పీలుస్తూ పక్షుల కిలకిలారావాలు వింటూ ఆస్వాదిస్తున్నా. ఈ మధ్య కాలంలో నేను ఇలా చేసింది లేదు.
ఊరికే అలా కూర్చుని, రిలాక్స్ అవుతూ జీవితం గురించి ఆలోచించి ఎన్ని రోజులు అయ్యిందో చెప్పండి.మనకంటూ పరిమితులున్నా మన బాగు కోసం, సంతోషం కోసం మనల్ని మనం అంగీకరించడం అనేది జీవితంలో ఎంతో ముఖ్యమైన అలవాటు. గత నెల రోజుల నుంచి, నేను ఇంతకు ముందు ఆలోచించని విషయాల గురించి సమయం కేటాయించగలుగుతున్నా. నా భయాల మీద శ్రద్ధ పెట్టి, వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నా. నేను ఎలా ఉన్నానో అలాగే అంగీకరించడం మొదలుపెట్టి, నా గురించి నేను చేసే పనుల గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం మానేశా.”