“మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నేను తనతో మొదటిసారి మాట్లాడింది, మా పెళ్ళి నిశ్చయం అయినప్పుడే. మాది మంచి దృఢమైన సంబంధం. ఆమె నా గురించే బాగా ఆలోచిస్తుంది. అలాంటి వ్యక్తిని ఎవరైనా ఇష్టపడకుండా ఎలా ఉంటారు చెప్పండి? నాకింకా గుర్తుంది, తను నన్ను అడిగిన మొదటి విషయం ప్రతి వారం తనను సినిమా కి తీసుకెళ్లమని. నేను తనని తీసుకెళ్ళాను. ఆరోజుల్లో సినిమా టికెట్ ఇప్పటి లాగా అంత ఖరీదు కాదు, కేవలం 10 రూపాయలు మాత్రమే. ఆ తెరల మీద సినిమా చూడటం ఒక అద్భుత అనుభవం. ఆరోజుల్లో, పెద్ద ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలు బాగా చూసేవాళ్లం.
మాకు పిల్లలు పుట్టాక, థియేటర్ కి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. కొన్నేళ్ల తరువాత, నా రిటైర్మెంట్ తరువాత నేను దీనికొక పరిష్కారం కనుక్కున్నాను. కొన్నేళ్ల క్రితం మా అబ్బాయి ఎల్ఈడి టివి కొన్నాడు. దాంతో ఇంట్లోనే సినిమాలు చూసే సాంకేతికతను మాకు పరిచయం చేశాడు. ఇంట్లోనే మేము ఒక చిన్న సినిమా హాల్ ఏర్పరుచుకున్నాం. నేను, నా భార్య కొద్ది గంటలు సినిమా చూస్తూ, ఆ పాత రోజులను గుర్తుచేసుకుంటాం. నా జీవితంలో మంచి సమయం అంటే ఇదే.”