“దసరా అంటే మా కుటుంబం మొత్తాన్ని ఒక దగ్గరికి చేర్చే పండగ. ఈ పండగని చెడు మీద మంచి విజయానికి అలాగే రాక్షసుల మీద దేవతల విజయానికి గుర్తుగా జరుపుకుంటాం. ఈ పండగని ప్రజలు విజయదశమి అని పిలుస్తారు. మహిషాసురుడిని జయించిన దుర్గా మాత పండుగ ఇది. నేను దసరా పండగ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసేదాన్ని, ఎందుకంటే కజిన్స్ అందరినీ ఒకేచోట కలిసే వీలుండేది. మాది ఖమ్మం జిల్లా కావడంతో దసరాతో పటు బతుకమ్మ పండగ కూడా జరుపుకుంటాం. తంగిడి, అడవి చామంతి, గుమ్మడి వంటి పూలని సేకరించడానికి మేము తెల్లవారుఝామునే నిద్ర లేచిన రోజులు నాకింకా జ్ఞాపకం ఉన్నాయి.
మేము ఆ పూలన్నిటినీ ఒక క్రమపద్ధతిలో అమర్చి, బతుకమ్మకు తగ్గట్టుగా కాండాలను కత్తిరించేవాళ్ళం. మేమందరం సాంప్రదాయ దుస్తులు ధరించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళం. లక్ష్మీనరసింహ స్వామి వారి ఊరేగింపు మా ఉరి ప్రత్యేకత. ఊరేగింపు తరువాత మేము జమ్మి చెట్టు మీద వాలే పాలపిట్టని చూసేవాళ్ళం. పాల పిట్టని చూడటానికి మేము ఎన్నో మైళ్ళు నడిచేవాళ్ళం. నాకు పెళ్లి అయ్యేంతవరకూ నేను దసరా పండుగని ఇలాగే జరుపుకునేదాన్ని.
ఇన్నేళ్ళలో ఎన్నో మార్పులు వచ్చాయి. మన సంప్రదాయాన్ని పాటించడానికి జనాలు అంత సుముఖంగా లేరని అనిపిస్తుంది. ఇది నన్ను చాలా కలిచి వేసింది. అందుకే శ్రీదేవీ సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘాన్ని స్థాపించాను. మేమంతా ఒక బృందంగా కలిసి ఈ కొత్త తరానికి మరిచిపోయిన మన సాంప్రదాయాలని పరిచయం చేస్తాం. ఇది అందరి దగ్గరికి తీసుకువెళ్ళడానికి మేము పండగ సమయంలో వివిధ పోటీలు నిర్వహిస్తాం. వాటిలో ఒక పోటీ ఏంటంటే,పండగ అప్పుడు అమ్మవారి లాగా 9 రకాలుగా తయారవ్వడం. దీనికి మంచి స్పందన లభించింది. నగరం చుట్టుపక్కల ఉండే స్థానికులు అందరూ ఇందులో పాలు పంచుకోవడం మొదలుపెట్టారు. అలాగే నేను అన్ని వయసు ఆడవారికి కోలాటం నేర్పించడం మొదలుపెట్టాను. ఇలాంటి సంప్రదాయాలను పాటించడం అలాగే మన ముందు తరాల వారికి వీటి గురించి తెలియచేయడం ఎంతైనా అవసరం అని నేను నమ్ముతాను.”