“ఇంతకు ముందు షేవింగ్, కటింగ్ చేపించుకునే అవసరం లేకపోయినా జనాలు నా షాప్ కి వచ్చి కబుర్లు చెప్పుకుంటూ, న్యూస్ పేపర్లు చదువుకునేవాళ్ళు. ఈ కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రజలు ఇళ్ళ నుంచి బయటికి రావట్లేదు. దీంతో వ్యాపారం బాగా దెబ్బతినింది. ఇవాళ రేపు అయిదు, ఆరు హెయిర్ కటింగ్స్ చేయడానికి రోజంతా ఎదురుచూస్తూ ఉంటాను. గత రెండు నెలలు చాలా భారంగా గడిచాయి. ఒకటి రెండు రోజులు మూసేస్తేనే వ్యాపారాలు దెబ్బతింటే, రెండు నెలలు పూర్తిగా మూసేస్తే మా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. జూన్ లో షాపులు తీరడానికి ప్రభుత్వం అనుమతిచ్చినా కూడా, ఎన్నో భద్రతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. వ్యాపారానికి అనుమతిచ్చినా, అది మాకు అంతగా లాభసాటిగా ఏం లేదు. గత రెండు వారాల్లో, లాక్డౌన్ ముందు వచ్చే రాబడిలో సగం కూడా రాలేదు. ఒక్కోసారి కస్టమర్లు సెలూన్ లో పేస్ మాస్క్ తీసేస్తామని అంటారు. వాళ్ళకి మాస్క్ తీస్తే చాలా ప్రమాదం అని చెప్పాల్సి వస్తుంది. మా షాప్ కి వచ్చే వారిని ఇబ్బంది పెట్టడం మా అభిమతం కాదు. కస్టమర్లు, స్టాఫ్ ని కాపాడటమే మా ధ్యేయం. మా రెగ్యులర్ కస్టమర్లు చాలా మంది గ్రూమింగ్ సేవలకి బయటకి రావడానికి భయపడుతున్నారు. మేము చేయగలిగిందల్లా వాళ్ళు సౌకర్యవంతంగా మా షొప్ కి వచ్చే దాకా ఎదురుచూడటమే.”