“మాది దాసరి వర్గం, మమ్మల్ని హరిదాసులు అంటారు. మేము ఊరూరా తిరిగి భక్తి పాటలు పాడతాము. ఇది మన సంప్రదాయం. ఈ బట్టల్లో నన్ను చూసి అందరూ నేను నారదుడిలా ఉంటాను అంటారు.నేను ఇంటింటికీ తిరిగి భిక్ష అడుగుతాను. ప్రజలు ఇచ్చే కానుకలు “కృష్ణార్పణం” అనుకుంటా. ఇంతకు ముందు, మా వర్గానికి చెందిన వాళ్ళు సంక్రాంతి పండగకి ముందు నుంచే దీక్షలో ఉండి సంకీర్తనలు పాడేవాళ్లు. కానీ ఇప్పుడొచ్చే కొత్త తరం వాళ్ళు ఈ పద్దతి పాటించడానికి అంతగా ఉత్సాహం చూపట్లేదు, అందుకే మన సంప్రదాయం మెల్లిమెల్లిగా మాయమవుతుంది. సాధారణంగా మేము ధనుర్మాసం నుంచి భోగి వరకు నెల రోజులపాటు దీక్ష తీసుకుంటాం. ఈ పద్దతిని భక్తి సంప్రదాయం అంటారు. మేము రోజు ఉదయం 4:30 గంటలకే లేస్తాము. మా పూజా పునస్కారాలు అయ్యాక, దేవుడి గుణగణాలు కీర్తిస్తూ సాయంత్రమే తిరిగి వస్తాము. కీర్తనలు అంటే ఇష్టం ఉన్నవాళ్లు మాకు బాగా మర్యాద ఇస్తారు. భోగి పండగ అయ్యాక, నేను భద్రాచలం గుడిలో పూజ చేసి, అన్నదానం చేస్తాను. సంవత్సరంలో మిగతా సమయం నేను మా కుటుంబ వ్యాపారంలో మునిగిపోతాను.”