“నేను 4వ తరగతిలో ఉన్నప్పుడు, కరెంట్ షాక్ కొట్టడం వల్ల సగం ఎడమ చేతిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. మేము ఇల్లు కట్టుకునేటప్పుడు నేను మేడ మీదికి వెళ్ళాను, అప్పుడే ఈ ప్రమాదం జరిగింది. అప్పుడు పెద్ద వర్షం కురుస్తుంది, పక్కనే వైర్లు ఉన్న సంగతి చూసుకోక పొరపాటున వాటిని పట్టుకున్నాను. వెంటనే నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళారు, స్థానికంగా ఉండే డాక్టర్లు నాకు చికిత్స చేయలేమని చెప్పారు. నన్ను విజయవాడ తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళాక తెలిసింది నా చెయ్యి తీసెయ్యాలి అని. మా నాన్న గారు నన్ను మద్రాస్ తీసుకెళ్ళారు. మద్రాస్ లో నన్ను 5 రోజులు ఐసీయు లో ఉంచారు. వాళ్ళు కష్టపడ్డా కూడా అప్పటికే పరిస్థితి చేయిజారిపోయింది.
మా నాన్న రైతు. నా చికిత్స కోసం కూడా అప్పు చేయాల్సి వచ్చింది. అప్పట్లో నాకు ఇదంతా అర్థం కాలేదు. ఒక సంవత్సరం తరువాత,నేను తిరిగి పాఠశాల కి వెళ్ళాను.అక్కడ కొందరు ఉపాధ్యాయులు నన్ను వేరేలా చూసినా కానీ నా స్నేహితులు నన్ను మామూలుగానే చూశారు. మొదట్లో ఒక చేత్తో అన్ని పనులు చేసుకోవడం నాకు చాలా కష్టంగా ఉండేది. మెల్లిగా ఒక్క చేత్తోనే పనులు చేయడం నేర్చుకున్నా. అది చాలా కష్టం అయినా, నా తల్లిదండ్రులు, అన్నయ్య అందించిన సహకారం వల్ల ఇది సాకారం అయ్యింది.”
![](https://humansofandhra.org/wp-content/uploads/2019/11/72358670_1270221633179645_8441328809439128082_n.jpg)